కర్నూలు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (37) గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి చెందారు. మాసుంబాషా దర్గా సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
స్థానిక వివరాల ప్రకారం.. నగదు లావాదేవీలకు సంబంధించిన విషయంపై ఇంతియాజ్‌కు ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో కర్నూలులో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
also read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? వైరల్ వార్తలపై మెగా టీమ్ క్లారిటీ
