-వైసీపీలోకి రీ ఎంట్రీ
-జగన్ గ్రీన్ సిగ్నల్
-ఉభయ వర్గాల మధ్య కీలక చర్చలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేత విజయసాయిరెడ్డి తిరిగి చేరే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా మరోసారి అటువంటి ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్ మీడియాను సిద్ధం చేసిన ఆయన.. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలన్నా ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏడాదిన్నర కిందట రాజీనామా..
ఏడాదిన్నర కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాదు రాజ్యసభ పదవికి సైతం రిజైన్ చేశారు. అయితే తరువాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాల్లోకి పోదలుచుకోలేదని కూడా చెప్పారు. అయితే వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. ఆ పార్టీ రాజ్యసభ పదవిని వదులుకొని మరి బయటకు వెళ్లిపోయారు. కేవలం కూటమితో ఒప్పందం చేసుకుని వెళ్లారని.. ఇది ఒక వెన్నుపోటుగా వైసీపీ నేతలు అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి సైతం తీవ్ర విమర్శలు చేశారు. అయితే వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ప్రకటన ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ సమయంలో సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా మరోసారి ప్రకటన చేశారు. దీంతో విజయసాయిరెడ్డి ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
సంక్షోభంలో పార్టీ..
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆ పార్టీ. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడం, విపక్షాలు దాడి చేస్తున్న వేళ పార్టీ తరఫున గట్టిగా నిలబడడం, సరైన పొలిటికల్ స్ట్రాటజీలను అమలు చేయడంలో లోటు కనిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి తో వై వి సుబ్బారెడ్డి చక్కబెడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి అంతగా ప్రభావితం చూపలేకపోతున్నారు. క్యాడర్లో కూడా అదే అసంతృప్తితో ఉంది. అందుకే విజయసాయిరెడ్డిని మళ్లీ తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
మరోవైపు విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, పొలిటికల్ గ్యాప్ ఆయనకు రాజకీయ మైలేజ్ ఇవ్వడంలేదు. మళ్లీ రాజకీయంగా ప్రాధాన్యత దక్కాలంటే యాక్టివ్ పాలిటిక్స్ చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు విజయసాయిరెడ్డి. దశాబ్దాలుగా వైయస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. వైసిపి నిర్మాణంలో తన పాత్రను గుర్తించి.. మళ్లీ వైసీపీలో చేరిపోతేనే బాగుంటుందని విజయసాయి రెడ్డికి సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేయడంతో ఆయన మనసులు విజయసాయిరెడ్డి తో చర్చలు జరుపుతున్నారని కూడా ఒక ప్రచారం ఉంది..
తప్పకుండా అభ్యంతరాలు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధినేత చుట్టూ ఉన్న కోటరీ వల్ల తాను బయటకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేరిక విషయంలో అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలో తన హోదా, పాత గౌరవం దక్కితే కానీ విజయసాయిరెడ్డి సైతం వైసీపీలో చేరే ఛాన్స్ లేదు. కానీ రాజకీయాల్లో అవసరాలు పనిచేస్తాయి. విజయసాయిరెడ్డి అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ కు ఉంది. అంతే అవసరం విజయసాయి రెడ్డికి కూడా ఉంది. అందుకే సంచలన రాజకీయ నిర్ణయం ఉండబోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
