-ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్ కోసం గట్టి పోటీ
-సిట్టింగ్ ఎమ్మెల్యేగా అఖిల ప్రియ
-పార్టీ కార్యక్రమాలను ఒంటరిగా చేస్తున్న కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి
-మరోవైపు పోటీకి సిద్ధమంటున్న అఖిల ప్రియా రెడ్డి
క్రైమ్ మిర్రర్, రాయలసీమ బ్యూరో :-
సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కుటుంబంలో చీలిక వచ్చిందా? పదవుల కోసం పిల్లలు విడిపోతున్నారా? రాజకీయ ఆధిపత్యం లో భాగంగా వారి మధ్య విభేదాలు నడుస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల అహోబిలం వివాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను చంద్రబాబు పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల జోక్యం అధికం అవుతోందని.. దానిని తగ్గించుకోవాలని హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. పరోక్షంగా ఆమె భర్త ప్రమేయం పెరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలోనే హై కమాండ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
వివాదాల్లో అఖిలప్రియ..
మొన్నటి ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు భూమా అఖిల ప్రియ. కానీ తరచు ఆమె వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటున్నారు. పార్టీ హై కమాండ్ ఎప్పటికప్పుడు మందలిస్తూ వస్తోంది. కానీ ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన తండ్రి అనుచరులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి బరిలో దిగేందుకు జగత్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల ప్రియ తరచు వివాదాల్లో చిక్కుకోవడంతో ప్రత్యామ్నాయంగా టిడిపి నాయకత్వం విఖ్యాత్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నట్లు కూడా కర్నూలు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ప్రచారం సాగుతోంది.
భూమా దంపతుల ముద్ర..
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తనదైన శైలిలో రాజకీయాలను నడిపారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం గడిపిన ఆ దంపతులు ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీతో ఆ పార్టీలో చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. కానీ శోభా నాగిరెడ్డి అకాల మరణంతో ఆమె తరుపున రంగంలోకి దిగారు అఖిలప్రియ రెడ్డి. తండ్రి శోభ నాగిరెడ్డి తో కలిసి అసెంబ్లీకి పోటీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరూ గెలిచారు. కానీ తరువాత క్రమంలో టిడిపిలోకి ఫిరాయించారు. ఇంతలో భూమా నాగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో అఖిలప్రియ ఓడిపోయారు. 2024 లో మాత్రం గెలిచారు.
నంద్యాలలో నో ఛాన్స్..
నంద్యాల తో పాటు ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ప్రత్యేక పట్టు ఉంది. అయితే ఆ రెండు నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు కేటాయించాలని అఖిల ప్రియ కోరారు. కానీ నంద్యాల నుంచి ఎండి ఫరూక్ ను రంగంలోకి దించారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ఉన్న ఒక్కగానొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గం కోసం భూమా నాగిరెడ్డి పిల్లలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంచు మనోజ్ కుమార్ భార్య భూమా అలేఖ్య రెడ్డి సైతం పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతున్నారు. ఆమె కూడా ఆళ్లగడ్డపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు పిల్లల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయింది. ఎవరికివారుగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
