-ఒక్కో రాష్ట్రంలో పతనం అవుతున్న సంప్రదాయ రాజకీయ పార్టీలు
-పుట్టుకొస్తున్న కొత్త రాజకీయ పార్టీలు
-భవిష్యత్తులో బిజెపిని ఢీకొట్టేవి అవే
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
దేశంలో పాత రాజకీయ పార్టీలకు కాలం చెల్లిందా? సంప్రదాయ రాజకీయ పార్టీలకు ఇక ప్రజాబలం లేనట్టేనా? భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే సామర్థ్యం కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకే ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత దశాబ్దానికి పైగా భారతీయ జనతా పార్టీ తనను తాను ఆవిష్కరించుకుంటుంది. అశేష భారతావనిని చుట్టేస్తోంది. కాశ్మీర్ టు కన్యాకుమారిని కవలించింది. ఈ నేపథ్యంలో బిజెపికి ధీటుగా నిలబడేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తున్నాయి. బీహార్లో తేజస్వి యాదవ్ తో పాటు ఆర్జేడి ని దెబ్బ తీయడానికి ప్రశాంత్ కిషోర్, తమిళనాడులో ద్రవిడ పార్టీలైన డిఎంకె, అన్న డీఎంకే సుదీర్ఘ పాలనతో ఏర్పడిన రాజకీయ సూన్యతను భర్తీ చేసేందుకు దళపతి విజయ్ ముందుకు రావడంతో అక్కడి ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టి బిజెపికి అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా దేశవ్యాప్తంగా నయా జనరేషన్ ఓటర్లను ఆకర్షిస్తున్న జెన్ జీ ఆధారిత ఉద్యమాలు సరికొత్త రాజకీయాలను ఆవిష్కరించేందుకు దోహదపడుతున్నాయి.
ప్రతి రాష్ట్రంలోనూ కొత్త శక్తి..
ప్రస్తుతం జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు పై మాత్రమే ఆధారపడుతున్నాయి. అర్బన్ ఓటర్లు, నిరుద్యోగ యువత, నయా జనరేషన్ కోరుకుంటున్న ఆధునిక అంశాలను, పారదర్శకతను వారు అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు జన్ సూరజ్ ద్వారా బీహార్లోని ఆర్జెడి, జెడియు కుల రాజకీయాలకు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. దీనివల్ల పాత విపక్షాల ఓటు బ్యాంకు విచ్ఛిన్నమై.. ఆర్జెడి తన ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి బిజెపికి లాభం..
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం ద్వారా దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకె, అన్నా డీఎంకే ద్విపక్ష ఆధిపత్యానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవిడ సిద్ధాంత మూస నుంచి బయటపడాలనుకుంటున్న యువత విజయ్ వైపు మొగ్గు చూపారు. సరిగ్గా ఇదే తరహా ప్రయోగం పశ్చిమ బెంగాల్లో బిజెపికి అక్కరకు వచ్చింది. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా వస్తున్న ఈ మార్పు భారతీయ జనతా పార్టీకి కొంత ప్రయోజనం చేకూర్చుతోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీల ఓట్లు చీలిపోయి.. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక కొత్త ప్రాంతీయ పార్టీ, జనతా ఉద్యమాల వల్ల పాత విపక్షాలు బలహీనపడుతున్నాయి. అధికారంలో ఉన్న బిజెపి గెలిచేందుకు ఇది సులువవుతోంది. అయితే రానున్న కాలంలో మాత్రం కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కచ్చితంగా బిజెపిని ఢీ కొడతాయి. ఆ పరిస్థితి వస్తుంది కూడా.
