Homeతెలంగాణఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్ట్!

ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్ట్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
ఆదిలాబాద్ లో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనతో.. జిల్లాలో రహదారి వ్యవస్థలు సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. విమానాశ్రయం కోసం చేపట్టనున్న భూసేకరణలో ప్రస్తుతం వేలాదిమంది వినియోగిస్తున్న ప్రధాన రహదారి కూడా చేరనుంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుపై దృష్టి పెట్టారు. దాదాపు 30 గ్రామాల ప్రజల రాకపోకలు అంతరాయం కలగకుండా కొత్త బైపాస్ రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణం నుంచి ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కచికంటి గ్రామానికి వెళ్లేందుకు శ్రీరామ్ కాలనీ, కుమ్మరి వాడ, విమానాశ్రయ ప్రతిపాదిత స్థలానికి ఆనుకొని ఉన్న ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ మీదుగా ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయ నిర్మాణంతో ఈ మార్గం మూతబడనుంది.

కొత్త రోడ్డు నిర్మాణ ప్రతిపాదన..
ప్రత్యామ్నాయంగా కచికంటి నుంచి బంగారు గూడా ప్రధాన రహదారిని అనుసంధానించే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సమీపంలో కొత్త బైపాస్ నిర్మించి.. అక్కడ అవసరమైన భూసేకరణ చేపట్టనున్నారు. కొత్త రహదారిని 66 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గం ద్వారా బంగారు గూడ, కచికంటి మీదుగా ఆదిలాబాద్ పట్టణానికి సులభంగా చేరుకునే అవకాశం కలగనుంది. విమానాశ్రయ నిర్మాణం వల్ల కలిగే రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రహదారిని రూపొందిస్తున్నారు.

ఈ గ్రామాల ప్రధాన రహదారి..
ఆదిలాబాద్ మండలంలోని యాపల్ గూడ, యశ్వంత్ గూడ, మత్తడిగూడ, బూర్నూరు, అడ్డగుట్ట, శివ ఘాట్, కుంభఝరి, టాక్లీ గ్రామాలతో పాటు సత్నాల మండలంలోని రామాయి, జామున్ ధరి, న్యూ రాంపూర్, సాత్నాల, సుందరగిరి, మాంగుర్ల, కాన్ఫమేడిగూడ, మేడిగూడ, జామ్ని, మారుగూడ, తోయగూడ, సైదుపూర్, సహేజ్, సాంగ్వి, జాస్టు గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారిని వినియోగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రం చేరుకోవడాన్ని ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోని బంగారు గూడ, అనుకుంటా గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. అటువంటి రోడ్డు విమానాశ్రయ పరిధిలో వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాకపోకలు కల్పించేందుకు కొత్త రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకుంది.

రూ. 5 కోట్లు మంజూరు..
కొత్త రోడ్డు నిర్మాణం, భూ సేకరణ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.35 కోట్లను ఆర్ అండ్ బి శాఖకు కేటాయించింది. విమానాశ్రయ నిర్మాణంతో పాటు రహదారి నెట్వర్క్ ను కూడా ఆధునీకీకరించడం ద్వారా.. ఆదిలాబాద్ జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తు అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయం, కొత్త రహదారులు జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఊతం ఇవ్వనున్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు