-వచ్చే ఎన్నికల్లో కుమార్తెకు టికెట్
-కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు తొమ్మిదిన నల్లబెల్లి రాక
-పెద్ద ఎత్తున సంస్మరణ సభలు నిర్వహించాలని నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సుదర్శన్ రెడ్డి మరణంతో తీవ్ర దుఃఖంతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 9న కెసిఆర్ ఆయన స్వగ్రామానికి రానున్నారు. నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించే సంస్మరణ సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. మరోవైపు ఈనెల 10న హనుమకొండలో జరిగే సంస్మరణ సభకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు.
తెలంగాణ ఉద్యమ నేత..
పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలు కూడా చూశారు. ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అందుకే ఆ కుటుంబానికి అండగా నిలవాలని కేసిఆర్ భావించారు. అయితే సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున సంస్మరణ సభలు నిర్వహించాలని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు అందరూ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మంచి అనుబంధం..
పెద్ది సుదర్శన్ రెడ్డికి కెసిఆర్ తో మంచి అనుబంధం ఉంది. ఉద్యమ సహచరుడిగా, విశ్వాస పాత్రుడిగా మెలిగే వారు. అందుకే ఆ కుటుంబాన్ని రాజకీయంగా ప్రోత్సహించాలని కూడా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి కుమార్తెకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ ఇంట్లో పిల్లల చదువులకు ప్రోత్సాహం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారిని.. కొంత మొత్తం అప్పులతో ఉన్నారని.. వాటి బాధ్యతలను సైతం తామే చూస్తామని కేసీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని కెసిఆర్ భావించడం నిజంగా గొప్ప విషయమే.
