-
మునుగోడులో విద్యా విప్లవానికి నాంది
-
విద్యకు పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ
-
మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాల సమస్యలపై సమగ్ర సమీక్షకు సిద్ధం
-
మరమ్మత్తులు, నూతన భవనాల నిర్మాణం,
-
మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం ఇవ్వనున్న ఎమ్మెల్యే
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మునుగోడు నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి, కొత్త ఊపు తీసుకొచ్చేలా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను సమగ్రంగా గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో అధికారులు, విద్యాశాఖ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో, శిథిలావస్థకు చేరిన భవనాలు, పైకప్పుల లీకేజీలు, తరగతి గదుల కొరత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే, వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అవసరమైన చోట తక్షణ మరమ్మత్తులు చేపట్టడంతో పాటు, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అధికారులను ఆదేశించనున్నారు.
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలపైనే విశ్వాసం పెంచుకునేలా, అన్ని సౌకర్యాలు కల్పించాలన్నది ఎమ్మెల్యే లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని, విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని భావిస్తూ, విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించే అవకాశం ఉంది. వసతి, భోజనం, భద్రత, పరిశుభ్రత, తాగునీరు, విద్యా సామగ్రి, డిజిటల్ సదుపాయాలు వంటి అంశాలపై, పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, లోపాలన్నింటినీ దశలవారీగా పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడుతున్నారు.
విద్యా రంగంలో నాణ్యత పెరగాలంటే కేవలం భవనాల నిర్మాణమే కాకుండా, బోధనా ప్రమాణాలు కూడా మెరుగుపడాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరగడం, డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం, పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడం, పోటీ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులను సిద్ధం చేయడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులతో నిర్వహించే సమీక్షలో ప్రతి పాఠశాల పరిస్థితిపై విడివిడిగా చర్చించి, అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణపై, కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
విద్యా వ్యవస్థ బలోపేతమే సమాజ అభివృద్ధికి పునాది అనే ఆలోచనతో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుకు సాగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంపై, ఆయన చూపుతున్న చొరవ వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలకు కొత్త ఊపు వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ చర్యలు కార్యరూపం దాల్చితే మునుగోడు నియోజకవర్గం, విద్యారంగంలో ఆదర్శంగా నిలిచే అవకాశముందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
