-
హైకోర్టు న్యాయమూర్తుల అభ్యంతరాలు
-
రోజురోజుకు పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు
-
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోతే న్యాయవ్యవస్థతో సంఘర్షణ
-
సీఎం రేవంత్ వెనక్కి తగ్గే అవకాశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను తప్పించడం ఖాయమా? కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనా? కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఏకంగా ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు హైడ్రా తీరుపై.. కమిషనర్ రంగనాథ్ వైఖరి పై తీవ్రస్థాయిలో అభ్యంతర వ్యక్తం చేశారు.
బుల్డోజర్ సంస్కృతి, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు దిగడం, కోర్టు ఆదేశాలను బేకాతలు చేయడం వంటి చర్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో హైడ్రా భవితవ్యం డైలమాలో పడింది.
-
ప్రభుత్వ భూముల పరిరక్షణకు..
హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు లక్ష్యంగా ఏర్పాటయింది హైడ్రా. అయితే లోతుకుంట భూవివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఏకంగా హైడ్రాను పౌరాణిక రాక్షస మృగంతో న్యాయమూర్తి పోల్చారు.
హైడ్రా వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. అయితే మిగతా డివిజనల్ బెంచ్ భిన్న వైఖరి వ్యక్తం చేస్తుందని అంతా భావించారు. కానీ వేరు వేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇతర న్యాయమూర్తులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చేపడుతున్న ఆకస్మిక చర్యలు, విచారణ అధికారుల అతిక్రమనను తీవ్రంగా తప్పుపట్టారు. స్వయంగా కమిషనర్ రంగనాథ్ దాదాపు 62 కోర్టు ధిక్కరణ కేసుల్లో నిందితుడిగా ఉండడం న్యాయవ్యవస్థ తీవ్రంగా పరిగణించింది. అందుకే కీలక ఆదేశాలు ఇచ్చింది.
-
రేవంత్ కలల ప్రాజెక్టు..
వాస్తవానికి ప్రభుత్వ ఆస్తుల తో పాటు చెరువుల పరిరక్షణకు రేవంత్ సర్కార్ ఈ హైడ్రా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్. బ్రాండ్ హైదరాబాద్ పునరుద్ధరణగా దీనిని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రారంభంలో ప్రజల నుంచి, పర్యావరణ వేత్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆ వ్యవస్థపై పిటిషన్లు దాఖలవుతుండడం.. న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో.. రేవంత్ సర్కార్కు రాజకీయంగా, పాలనాపరంగా పెద్ద సవాల్ గా పరిణమించాయి.
-
తప్పదు తప్పించడం..
హైకోర్టు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథును మార్చాలని ఆదేశించడం సంచలనంగా మారింది. న్యాయ సమ్మతమైన ఆదేశాలను గౌరవించే ఐపీఎస్ అధికారిని నియమించాలని సూచించడం మాత్రం గమనార్హం. ఒకవేళ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రంగనాథ్ ను అదే పోస్టులో కొనసాగిస్తే.. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
అందుకే సీఎం రేవంత్ త్వరగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రంగనాథ్ ను తప్పిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అధికారి ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ప్రశ్న.
అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్లినా.. రంగనాథును కొనసాగించేందుకు రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తారని ప్రచారం సాగింది. కానీ ఈ విషయంలో సంక్లిష్టతకు తావు ఇవ్వకుండా మధ్య మార్గంగా వెళ్లాలని రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
