క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ టాలీవుడ్, పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ఓ తీవ్రమైన గాయానికి గురైనట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, ఆమె ‘హిప్ ఏరియా’ (తుంటి భాగం) లో తీవ్రమైన గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గాయం మామూలు గాయం కాదని, దీనిని వైద్య పరిభాషలో ‘టెండన్ డిటాచ్‌మెంట్’ అని పిలుస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఈ ‘టెండన్ డిటాచ్‌మెంట్’ అంటే ఏమిటి? దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అన్న విషయాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
టెండన్ డిటాచ్‌మెంట్ అంటే ఏమిటి?
మన శరీరంలో కండరాలను ఎముకలతో అనుసంధానం చేసే చాలా బలమైన కణజాలాన్ని ‘టెండన్’ (స్నాయువు) అంటారు. ఏదైనా కండరం ఎముకకు అతుక్కుని ఉండే ఈ టెండన్, తీవ్రమైన ఒత్తిడి వల్ల లేదా ప్రమాదం వల్ల ఎముక నుండి విడిపోవడాన్ని ‘టెండన్ డిటాచ్‌మెంట్’ అని అంటారు. వైద్య పరిభాషలో దీనిని ‘అవల్షన్ టియర్’ లేదా ‘కంప్లీట్ టెండన్ రప్చర్’ అని కూడా పిలుస్తారు. అంటే కండరం, ఎముకల మధ్య ఉండే అనుసంధానం పూర్తిగా తెగిపోవడం లేదా విడిపోవడం అన్నమాట.ఈ గాయం వల్ల కలిగే ఇబ్బందులు ఇవే..ఈ రకమైన గాయం మామూలు కండరాల నొప్పుల కంటే చాలా తీవ్రమైనది. రష్మికకు తుంటి భాగంలో ఈ గాయం కావడం వల్ల ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ‘టెండన్ డిటాచ్‌మెంట్’ వల్ల ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బందులు ఇవే.
కాలును పక్కకి జరుపలేకపోవడం:-
కాలును పక్కకు జరపడం, అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా మారుతుంది. తుంటి భాగం కదలికలకు ఈ టెండన్ చాలా ముఖ్యం కాబట్టి, చిన్న కదలిక కూడా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
బరువు మొయ్యలేకపోవడం-
గాయపడిన కాలుపై శరీర భారం మోపడం అసాధ్యం. నడవడం, నిలబడటం వంటి పనులు చేయడం చాలా కష్టమవుతుంది.
తీవ్రమైన నొప్పి, వాపు:- గాయమైన ప్రదేశంలో భరించలేని నొప్పి, వాపు, కణత వంటివి ఏర్పడతాయి.కారణాలు ఏమిటి?సాధారణంగా ఇలాంటి గాయాలు క్రీడాకారులలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఎవరికైనా కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఈ ‘టెండన్ డిటాచ్‌మెంట్’ జరిగే అవకాశం ఉంది.
ఎత్తైన ప్రదేశం నుండి కింద పడినప్పుడు, ముఖ్యంగా తుంటిపై నేరుగా బలంగా పడినప్పుడు ఇలాంటి గాయాలు జరిగే ప్రమాదం ఎక్కువ.రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాల్లో తుంటిపై విపరీతమైన ఒత్తిడి లేదా గాయం అయినప్పుడు టెండన్ తెగిపోయే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్, డాన్స్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో అకస్మాత్తుగా తీవ్రమైన ఒత్తిడితో కండరాలను లాగినప్పుడు లేదా మెలితిప్పినప్పుడు ఈ గాయం కావచ్చు.రష్మిక విషయంలో ఈ గాయం ఎలా జరిగిందనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు గానీ, లేదా వ్యాయామం చేస్తున్న సమయంలో గానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం రష్మిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఈ గాయం నయం కావడానికి ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ తరహా గాయాలు పూర్తిగా నయం కావడానికి కొన్ని వారాల నుండి నెలల సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం కావచ్చు. నేషనల్ క్రష్ రష్మిక త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
