క్రైమ్ మిర్రర్,భూపాలపల్లి:- జయశంకర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లువెల్లడించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..
– ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగకూడదు.
– చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకూడదు.
– నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు.
– పశువులను మేతకు తీసుకెళ్తున్నప్పుడు, వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
– విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
– శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
– అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
– వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించవద్దు.
– సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగులు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు.
జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహణ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
