క్రైమ్ మిర్రర్ : ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి నానక్ రామ్ భుర్జీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లఖ్‌నవూలోని ఓ రెసిడెన్షియల్ భవనం ఏడో అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లఖ్‌నవూలోని దారుల్ సఫా న్యూ ఎమ్మెల్యే రెసిడెన్స్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి నానక్ రామ్ భుర్జీ కిందపడిపోయారు. ఘటనను గమనించిన భవనం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నానక్ రామ్‌ను చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సిబ్బందిని పోలీసులు విచారించారు. గత కొంతకాలంగా నానక్ రామ్ భుర్జీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వారు తెలిపినట్లు సమాచారం. తరచూ రెసిడెన్స్ పరిసరాల్లో కనిపించేవారని సిబ్బంది వెల్లడించారు. అయితే ఆయన ప్రమాదవశాత్తు భవనం నుంచి జారిపడ్డారా? లేక ఇతర కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, విచారణ వివరాల ఆధారంగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : 12 ఏళ్లకే అరుదైన గౌరవం.. భవిష్యత్ స్పెయిన్ రాణిగా చరిత్ర సృష్టించనున్న యువరాణి లియోనోర్
