కాకినాడ, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శైలిని వేగంగా మార్చుకుంటూ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. గతంలో కేవలం ఎన్నికల సమయానికే పరిమితమవుతారనే విమర్శలకు చెక్ పెడుతూ, లభించిన అధికారాన్ని పార్టీ క్షేత్రస్థాయి విస్తరణకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న సమయాన్నే పార్టీని కేడర్ బేస్డ్ వ్యవస్థగా మార్చేందుకు ఆయన వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీరమహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ. ఏకంగా 36,000కు పైగా అప్లికేషన్లు వెల్లువెత్తడం జనసేన పార్టీ పెరుగుతున్న రాజకీయ గ్రాఫ్‌కు నిదర్శనంగా మారింది.ఈ భారీ స్పందన నుంచి కేవలం గుడ్డిగా నియామకాలు చేయకుండా, వడపోత ద్వారా నిఖార్సైన, సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే సైనికులను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు.
Also Read:ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి అరుదైన గౌరవం: ‘మిషన్ శక్తిశాట్’కు జెస్సీ ఎంపిక
పంచాయతీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి వరకు బలమైన కమిటీలను నిర్మించడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామీణ స్థాయిలో జనసేనకు తిరుగులేని పునాది వేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. డిప్యూటీ సీఎంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు తన వద్దే ఉండటం పవన్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్. పాలనలో తన ముద్ర వేస్తూనే, కేడర్‌కు పనులు చేసిపెట్టే అవకాశాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.కూటమిలో ప్రస్తుతం తక్కువ సీట్లతో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తన వాటాను సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో క్లెయిమ్ చేసేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఓటు బ్యాంకు మార్పిడిని ఎన్నికల్లో నిరూపించిన ఆయన, ఇప్పుడు సంస్థాగత బలం ద్వారా కూటమిలోనే అత్యంత డిమాండింగ్ ఫోర్స్‌గా మారాలని చూస్తున్నారు.
Also Read:థానేలో షాకింగ్ ఘటన: పోలీస్ లాఠీ లాక్కుని కానిస్టేబుల్‌పై దాడి
రాజకీయంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా రెండో స్థానంలో ఉండటానికి ఇష్టపడదు. పవన్ కళ్యాణ్ సుదూర వ్యూహం కూడా జనసేనను ఏపీలో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జనసేన పుంజుకుంటున్న ఈ వేగం అంతిమంగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సాంకేతికంగా పెద్ద సవాలుగానే మారే అవకాశముంది. దశాబ్దాలుగా బలమైన గ్రాస్‌రూట్ నెట్‌వర్క్ ఉన్న టీడీపీకి, అదే క్షేత్రస్థాయిలో జనసేన పోటీదారుగా మారడం భవిష్యత్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో టీడీపీకి ఏకపక్షంగా ఉన్న కొన్ని వర్గాల ఓటు బ్యాంకు, ఇప్పుడు జనసేన వైపు బలంగా మొగ్గుతుండటం మేజర్ పార్టీగా ఉన్న టీడీపీకి అంతర్గతంగా కొంత ఆందోళన కలిగించే అంశమే.ఈ రాజకీయ పరిణామాలకు టీడీపీ కూడా ఊరికే ప్రేక్షకపాత్ర వహించే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అడుగులకు చెక్ పెట్టడానికి లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Also Read:జెన్ జీ నిరసనలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు
ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తమ శ్రేణులను కాపాడుకునేందుకు సభ్యత్వ నమోదు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జుల మార్పులు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాల నామినేటెడ్ పదవుల కేటాయింపు వంటి చర్యలను టీడీపీ వేగవంతం చేస్తోంది. జనసేన ఎంతగా బలపడినా, కూటమిలో పెద్దన్న పాత్ర ఎప్పటికీ తమదేనని నిరూపించేలా పాలనాపరమైన మైలేజీని క్రెడిట్ చేసుకునే పనిలో పచ్చజెండా ఉంది.కూటమి ఐక్యత పైన కనిపిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం టీడీపీ, జనసేనల మధ్య సంస్థాగత బలాన్ని పెంచుకునే రహస్య పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న పక్కా పొలిటికల్ స్కెచ్‌లు జనసేనను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయా? లేక చంద్రబాబు చదరంగపు ఎత్తుల ముందు సానుకూల రాజకీయాలకే పరిమితమవుతాయా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోనుంది.
