మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గోమారం ప్రాంతానికి చెందిన గోపాల్ (45) అనే వ్యక్తి తన భార్య తిరిగి కాపురానికి రావడం లేదనే బాధను తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
సమాచారం ప్రకారం, గోపాల్ మద్యానికి అలవాటు పడటంతో కుటుంబంలో తరచూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య సురేఖ ఏడాది క్రితం పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమెను తిరిగి తీసుకురావడానికి గోపాల్ పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిసింది.
తాజాగా మరోసారి భార్యను ఒప్పించే ప్రయత్నంలో ఆమె ఇంటికి వెళ్లిన గోపాల్, ఆమె తిరిగి రావడానికి నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆవేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
also read: హైదరాబాద్లో లోగో డిజైన్ పోటీ: విజేతలకు రూ.20,000 వరకు నగదు బహుమతులు
