వరంగల్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంపై భారత ప్రమాణాల బ్యూరో (BIS) హైదరాబాద్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించడంతో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పి.వి. శ్రీకాంత్ ఆదేశాల మేరకు, డిప్యూటీ డైరెక్టర్లు కె. కవిన్, విజయరాజ్ బర్బర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సమయంలో హాల్‌మార్క్ లేకుండా విక్రయానికి ఉంచిన పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు.
ఈ దాడుల్లో నెక్లెస్ సెట్లు, ఉంగరాలు, గొలుసులు, చెవి దిద్దులు వంటి వివిధ రకాల ఆభరణాలు కలిపి సుమారు 7.8 కిలోల హాల్‌మార్క్ లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ చర్యలు బీఐఎస్ చట్టం-2016 నిబంధనల ప్రకారం చేపట్టినట్లు పేర్కొన్నారు.
సంబంధిత దుకాణంపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బీఐఎస్ డైరెక్టర్ పి.వి. శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణలో బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని, వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు.
వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా హెచ్‌యూఐడీ (HUID) ఉన్న హాల్‌మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు బీఐఎస్ కేర్ మొబైల్ యాప్‌లో ఆ నంబర్‌ను ధృవీకరించాలని తెలిపారు. అలాగే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.
హాల్‌మార్క్ దుర్వినియోగం లేదా నిబంధనలకు విరుద్ధంగా బంగారం విక్రయిస్తున్నట్లు ఎక్కడైనా గుర్తించినట్లయితే, వెంటనే బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
బంగారు ఆభరణాల రంగంలో నాణ్యత, పారదర్శకత కోసం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని బీఐఎస్ స్పష్టం చేసింది. అసలైన హాల్‌మార్క్ ఆభరణాలపై బీఐఎస్ లోగో, స్వచ్ఛత గుర్తు, ఆరు అంకెల హెచ్‌యూఐడీ ఉండాలని అధికారులు గుర్తుచేశారు.
also read: డేవిడ్ వార్నర్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు: నేరం అంగీకారం.. ఆగస్టు 18న శిక్షపై తీర్పు