క్రైమ్ మిర్రర్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు భారతీయుల ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరో వ్యక్తి తమిళనాడులోని చెన్నైకి చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. టెక్సాస్‌లోని యూఎస్–75 హైవేపై బాధితులు ప్రయాణిస్తున్న కారు బెంటన్‌విల్లే వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో మొత్తం ఐదు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం వాహనాలకు మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మంటల్లో చిక్కుకున్న కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్‌తో పాటు చెన్నైకి చెందిన దర్శిని వాసుదేవన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందినవారని సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారినట్లు సమాచారం. అమెరికా అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఈ విషాద వార్తతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.
also read : బస్టాండ్ అవరణంలో మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్