క్రైం మిర్రర్ : హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. నందనవనం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ సూరి గతంలో తన భార్యతో పాటు బావమరిది సల్మాన్ హత్య కేసులో నిందితుడిగా అరెస్టై జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం అతనిపై పోలీసులు నగర బహిష్కరణ చర్యలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో సూరి ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు టీకేఆర్ కాలేజీ సమీపానికి వెళ్లాడు. ఇదే సమయంలో పాత కక్షలు కొనసాగుతున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ పథకం ప్రకారం సూరిని అక్కడికి రప్పించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొంతకాలంగా సూరితో స్నేహంగా ఉంటున్నట్లు నటించిన అఫ్రోజ్, అతను అక్కడికి చేరుకున్న వెంటనే దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముందుగా పేపర్ స్ప్రే ఉపయోగించి, అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్పేట ఇన్స్పెక్టర్ శోభన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల వివరాలు, హత్యకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు రెండు మార్గాలు.. బెయిల్పై ఉత్కంఠ