క్రైం మిర్రర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మేఘాలయ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పీబీ వరాలే నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. విచారణ సందర్భంగా సోనమ్ తరఫు న్యాయవాదికి కోర్టు రెండు మార్గాలను సూచించింది. ఒకవైపు బెయిల్ రద్దు పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి కోర్టే తుది నిర్ణయం తీసుకోవడం, మరోవైపు కేసులో సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు సోనమ్ స్వచ్ఛందంగా కోర్టు ముందు లొంగిపోవడం వంటి అవకాశాలను ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై సోనమ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు సూచనలపై తమ నిర్ణయాన్ని గురువారంలోగా తెలియజేస్తామని తెలిపారు.
విచారణ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సోనమ్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన పరిస్థితుల్లో, అరెస్టుకు సంబంధించిన కారణాలు తెలియజేయలేదనే సాంకేతిక అంశాల ఆధారంగా బెయిల్ మంజూరు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన వాదించారు.
స్వచ్ఛందంగా పోలీసుల ఎదుటకు వచ్చిన నిందితులకు సాధారణ అరెస్టు ప్రక్రియలోని కొన్ని నిబంధనలు వర్తించవని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే హత్య ఘటన అనంతరం సోనమ్ వ్యవహరించిన తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసు తీవ్రత, దర్యాప్తు అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో సోనమ్ బెయిల్ కొనసాగుతుందా లేదా అనే అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
also read : విశాఖ పాత గాజువాకలో ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం..