క్రైమ్ మిర్రర్ : విజయవాడ నగరంలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం, శారీరక దృఢత్వం కోసం జిమ్ ట్రైనర్‌ను ఆశ్రయించిన ఓ యువతి తీవ్ర మోసానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బరువు తగ్గిస్తానని నమ్మించి, తనపై దాడికి పాల్పడ్డాడని, ప్రైవేట్ చిత్రాలతో బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించింది. బాధిత యువతి నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బరువు తగ్గించేందుకు, ఫిట్‌నెస్ మెరుగుపర్చేందుకు సలహాలు ఇస్తూ అతడు క్రమంగా ఆమెకు దగ్గరయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది.
తన వద్ద బరువు తగ్గేందుకు ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయని నమ్మించిన ట్రైనర్.. ఈ క్రమంలో ఓ రోజు హెల్త్ షేక్ తాగాలని చెప్పి ఆమెను ఓ ప్రైవేట్ హోటల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతడు ఇచ్చిన పానీయంలో మత్తు పదార్థం కలిపి ఉండటంతో తాగిన కొద్దిసేపటికే తాను స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసి తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుడిపై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తూ, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. మొబైల్ ఫోన్, డిజిటల్ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. నమ్మకంతో పరిచయం పెంచుకున్న వ్యక్తి నుంచి ఇలాంటి ఘటన ఎదురవడం ఆందోళన కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.