Homeతెలంగాణవరుస ఇంటి చోరీల కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

వరుస ఇంటి చోరీల కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

క్రైం మిర్రర్ :  ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కలకలం రేపిన వరుస ఇంటి చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన షిండే సునీల్ అలియాస్ రాకీ, కుమ్రే సుజల్ యురాజ్, మార్జివే శేఖర్, గాయకవాడ్ లక్ష్మణ్ కలిసి ఆదిలాబాద్‌లోని ఆదర్శ్‌నగర్, టైలర్స్ కాలనీల్లో తాళాలు పగులగొట్టి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించి పరారయ్యారు.ఈ ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మావల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో ప్రధాన నిందితుడు షిండే సునీల్ అలియాస్ రాకీపై గతంలోనే 8 చోరీ కేసులు నమోదై ఉండగా, కుమ్రే సుజల్ యురాజ్‌పై 3 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన మరికొన్ని చోరీ కేసుల్లో కూడా ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. వరుస చోరీలతో ఆందోళన చెందిన ప్రజలకు ఈ కేసు ఛేదనతో కొంత ఊరట లభించింది. నిందితులను వేగంగా గుర్తించి అరెస్ట్ చేసిన మావల పోలీసుల పనితీరును జిల్లా అధికారులు అభినందించారు.
also read : ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ దుర్మరణం.. డెలివరీకి వెళ్తుండగా విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు