క్రైం మిర్రర్ : హైదరాబాద్ శివారులోని నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్తున్న ఓ యువకుడిని వాటర్ ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స అందకముందే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నార్సంగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ కిలా ఫిల్ఖానా ప్రాంతానికి చెందిన రహమత్ అన్సారీ (19) జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వినియోగదారులకు ఆర్డర్ చేసిన వస్తువులను అందించేందుకు తన ఎలక్ట్రిక్ బైక్‌పై బయలుదేరాడు.
పుప్పాలగూడ పైప్‌లైన్ రోడ్డులోని హీరో షోరూమ్ సమీపానికి చేరుకోగానే అదే మార్గంలో వెళ్తున్న వాటర్ ట్రాక్టర్ అతని బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రహమత్ అన్సారీ తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని భూమి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న నార్సంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొనగా, ఉపాధి కోసం పనిచేస్తున్న యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.
also read : 7 నెలల చిన్నారిని అంతమొందించాలన్న కుట్ర బట్టబయలు.. తండ్రి, సవతి తల్లి అరెస్ట్