Homeక్రైమ్7 నెలల చిన్నారిని అంతమొందించాలన్న కుట్ర బట్టబయలు.. తండ్రి, సవతి తల్లి అరెస్ట్

7 నెలల చిన్నారిని అంతమొందించాలన్న కుట్ర బట్టబయలు.. తండ్రి, సవతి తల్లి అరెస్ట్

క్రైం మిర్రర్ :  కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో కలకలం రేపిన 7 నెలల చిన్నారి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచాయని నమ్మించే ప్రయత్నం చేసిన నిందితుల అసలు కుట్రను బీర్కూర్ పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో చిన్నారి తండ్రి, సవతి తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ ఉదయం బీర్కూర్ మండల కేంద్రంలో 7 నెలల చిన్నారి వైష్ణవి ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఇంటి సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించింది. వెంటనే ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై చిన్నారి తల్లి సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన కుమార్తెపై దాడికి తన అక్క శైలజ కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసిన బీర్కూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టేకు సతీష్‌కు మొదటి భార్య శైలజతో ముగ్గురు పిల్లలు ఉండగా, అనంతరం ఆమె చెల్లెలైన సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు వైష్ణవి జన్మించింది. తర్వాత కుటుంబ విభేదాల కారణంగా సంధ్య దూరమవగా, చిన్నారి తండ్రి వద్దే ఉండేది. చిన్నారిని పోషించడం భారంగా మారిందని భావించిన సతీష్, శైలజ కలిసి ఆమెను అడ్డుతొలగించాలనే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ప్రకారం.. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరూ ఎత్తుకెళ్లారు. అనంతరం సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి, గడ్డి పొదల్లో పడుకోబెట్టి వెంట తీసుకెళ్లిన బ్లేడ్లతో చిన్నారి శరీరంపై పలుచోట్ల గాయాలు చేశారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదంటూ గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి, గ్రామస్థులతో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. అలాగే కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచాయని ప్రచారం చేసి నేరాన్ని ప్రమాదంలా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన వివరాల ఆధారంగా పోలీసులు అసలు కుట్రను ఛేదించారు. నిందితులు టేకు సతీష్, శైలజ తమ నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించిన బీర్కూర్ పోలీసుల పనితీరును అధికారులు అభినందించారు. చిన్నారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు