క్రైం మిర్రర్ ; కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో మహిళను హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల గత మే 31 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త రాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించగా, కుటుంబ సభ్యులు దానిని శ్యామలగా గుర్తించారు.
ఈ కేసును డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు జూలై 17న కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పిట్ట నర్సింలు అలియాస్ నర్సింలును అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు శ్యామలతో జరిగిన వాగ్వాదం అనంతరం రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆమె మొబైల్ ఫోన్ను రూ.200లకు విక్రయించినట్లు కూడా వెల్లడించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో నిజామాబాద్, బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, హత్య కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. అపరిచిత వ్యక్తులతో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లొద్దని, అనుమానాస్పద ఘటనలు లేదా వ్యక్తుల గురించి వెంటనే డయల్-112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
also read : భార్యతో గొడవ.. పసికందును నేలకేసి కొట్టిన తండ్రి