మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో చోటుచేసుకున్న యువతి అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల అనంతరం యువతి చెరువులో మృతదేహంగా కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన వక్కలగడ్డ తేజస్విని (25) తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. గతంలో ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసినట్లు సమాచారం.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సమయంలో తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె దుస్తులు లేకుండా రోడ్డుపై కనిపించినట్లు స్థానికులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. అనంతరం సమీపంలోని ఓ ఆలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి అమ్మవారి విగ్రహం, చీరను తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే పీర్జాదిగూడ చెరువులో యువతి మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చెరువులో పడిపోయినట్లు భావిస్తున్న ఆలయ విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తేజస్విని మృతికి గల కారణాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. మానసిక పరిస్థితి, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: RAW NTR వివాదంపై క్లారిటీ.. సంస్థపై స్పందించిన వ్యవస్థాపకుడు సాయి రూప్