-
ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని వేధింపులు.
-
యువకుడి ఆత్మహత్య కేసులో మంద భారతి అరెస్ట్..రిమాండ్
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్న అనంతరం, తిరిగి ఇవ్వకుండా వేధింపులకు పాల్పడినట్లు, నమోదైన కేసులో నిందితురాలు మంద భారతిని, మర్రిగూడ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు తెలిసింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన, చాపల వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. వినయ్ సోదరుడు శివకు ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇబ్రహీంపట్నానికి చెందిన మంద భారతి నమ్మబలికినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మొదట ఫోన్‌పే ద్వారా ఉద్యోగం పేరుతో మొత్తం 50 వేల వరకు తీసుకున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొంతకాలం గడిచినా ఉద్యోగం రాకపోవడంతో తనకు ఉద్యోగం అవసరం లేదని, చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని శివ కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే డబ్బు తిరిగి ఇవ్వబోనని నిందితురాలు చెప్పడంతో పాటు, మాటలతో అవమానించిందన్నారు.
దీంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన్నప్పటికి, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మర్రిగూడ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 108, 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా నిందితురాలు మంద భారతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.