క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- కుమార్తెలను వేధింపులకు గురి వ్యక్తిని హత్య చేసిన ఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా తన కుమార్తెలను వేధిస్తున్నాడని ఒక యువకుడు పై కక్ష పెంచుకున్న తండ్రి.. నలుగురితో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేశాడు. మాదాపూర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బొప్పరపల్లికి చెందిన సీనపల్లి భాస్కర్ (32) గత కొంతకాలంగా హైదరాబాద్ మాదాపూర్ సైబర్ హిల్స్ కాలనీలోని ఒక హోటల్లో కుక్ గా పనిచేస్తున్నాడు. అతడికి స్వగ్రామానికి చెందిన తమ్మడ బోయిన రాజు యాదవ్ పెద్ద కుమార్తెతో 2020లో పరిచయం అయింది. అది కాస్త వీరిద్దరి మధ్య స్నేహంగా మారి సోషల్ మీడియాలో చాటింగ్ వరకు వెళ్ళింది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అమ్మాయికి దూరంగా ఉండాలని, అమ్మాయి జోలికి వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని యువకుడిని అమ్మాయి తండ్రి హెచ్చరించాడు. అయినప్పటికీ భాస్కర్ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. తీరు మార్చుకోవాలంటూ పలుమార్లు మందలించిన వినకుండా ప్రేమిస్తున్నానంటూ అమ్మాయి వెంట పడుతుండడంతో కొద్దిరోజుల కిందట పార్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత కొంతకాలం ఆమె వైపు చూడకుండా ఉండి కొన్నాలయ్యాక మళ్ళీ పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తుండడంతో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ తో పాటు వరంగల్ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు భాస్కర్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలోనే యువకుడు లో కొంత మార్పు కనిపించింది. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులు 2023లో ఒక ప్రభుత్వ ఉద్యోగతో వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన తర్వాత భాస్కర్ మళ్ళీ ఆమెతో చాటింగ్ ప్రారంభించాడు. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె భర్తకు పంపించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా గత నెల 23న విడాకులు మంజూరయ్యాయి.
యువతి చెల్లిని వేధిస్తుండడంతో దారుణ హత్య..
విడాకులు మంజూరైన తర్వాత గత నెలలో యువతి హైదరాబాదులోని బేగంపేటలో తన చెల్లి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ ఆమె చెల్లిని సైతం వేధించడం ప్రారంభించాడు. ఆమె పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ లో ఫేక్ ఐడి సృష్టించి మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నాడు. ఈ వేధింపుల విషయాన్ని ఆమె తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇద్దరు కుమార్తెలను వేధింపులకు గురిచేస్తుండడంతో భాస్కర్ పై తండ్రి రాజు యాదవ్ కక్ష పెంచుకున్నాడు. ఎలా అయినా అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో బావమరిది కుమారస్వామి, మరో ముగ్గురితో కలిసి భాస్కర్ పనిచేస్తున్న హోటల్ వద్దకు వెళ్లాడు. బావ, బావమరిది బయట ఉండగా మిగిలిన ముగ్గురు హోటల్ కి వెళ్లి భాస్కర్ను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే కర్రలు, కత్తితో సిద్ధంగా ఉన్న రాజు, కుమారస్వామి తో కలిసి రోడ్డుపైన భాస్కర్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రికి వెళ్లే సమయానికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి రాజు యాదవ్, కుమారస్వామిని అదుపులోకి తీసుకున్నారు. పరారీ లో ఉన్న ముగ్గురి కోసం గారిస్తున్నారు. నిందితులపై హత్య కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య తర్వాత మృతుడి సోదరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజు యాదవ్ పెద్ద కుమార్తె, తన తమ్ముడు ప్రేమించుకున్నారని, కులాలు వేరు కావడంతో ఆమె తండ్రి అంగీకరించలేదని పేర్కొన్నాడు. మరో వ్యక్తితో వివాహం చేసిన ఆమె తన తమ్ముడితో మాట్లాడుతూనే ఉండేదని, విడాకులు తీసుకున్నాక మా వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు వెల్లడించాడు. దానికోసమే మూడు రోజుల క్రితం నగరానికి వచ్చాడని, బుధవారం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారని, అంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.