•ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు
•సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. గులాబీ పార్టీ ముఖ్య నేత తన్నీరు హరీష్ రావు త్వరలో భారీ పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం.. బసవేశ్వర నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అని తేల్చి చెప్పారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపి వేసిందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అందుకే పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు.
త్వరలో కేటీఆర్..
త్వరలో తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలో హరీష్ రావు పాదయాత్ర పై ప్రకటన చేయడం గమనార్హం. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా తీసుకొని.. గులాబీ పార్టీ ముఖ్య నేతలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. గులాబీ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్న కేటీఆర్- హరీష్ రావుల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం నడిచింది. వాటన్నింటినీ చెక్ చెబుతూ ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతుండడం గమనార్హం.
సుదీర్ఘ కసరత్తు..
గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఆయన ప్రజల్లోకి వచ్చింది తక్కువ. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ప్రత్యేక వేదికల వద్ద తన గళం వినిపిస్తూ వస్తున్నారు కేటీఆర్. అందుకే క్షేత్రస్థాయిలో పాదయాత్ర పై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టచ్ చేసే విధంగా కేటీఆర్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ ముఖ్యులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్రకు సన్నాహకంగా అన్ని జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రాంతీయ సమస్యలను వేదికగా చేసుకుని ఈ పాదయాత్రలు కొనసాగనున్నాయి. ఇప్పుడు హరీష్ రావు ముందుగా పాదయాత్ర చేయనున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో.