అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. శతాబ్దాల క్రితం మొఘలుల పాలనలోనే అసలైన దోపిడీలు జరిగాయని అన్నారు. ఆ కాలంలో అనేక దేవాలయాలు ధ్వంసం అయ్యాయని, మహిళలపై కూడా అనేక దారుణాలు జరిగాయన్నారు. అలాంటి సంఘటనలతో పోలిస్తే ప్రస్తుతం అయోధ్య రామమందిర విరాళాల విషయంలో వస్తున్న ఆరోపణలు చాలా చిన్నవేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎదురైన పెద్ద కష్టాలను కూడా భారత్ అధిగమించిందని, ఈ అంశాన్ని కూడా అదే కోణంలో చూడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే అనుపమ్ ఖేర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ స్పందిస్తున్నారు. ప్రస్తుతంలో జరుగుతున్న అంశాన్ని శతాబ్దాల నాటి చరిత్రతో పోల్చడం సరైన విధానం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది అసంబద్ధమైన వాదన అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, కొందరు మొఘల్ పాలనకు అనుకూలంగా స్పందించారు. ఆ కాలంలో కళలు, సాహిత్యం, నిర్మాణ రంగాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేస్తున్నారు. అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక స్థానంలో నిలవడానికి మొఘల్ కాలం కూడా ఒక కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. ఈ వ్యవహారంపై కోర్టు తదుపరి విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.