క్రైం మిర్రర్ : షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురు హత్యల కేసు దర్యాప్తులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. హత్యలకు ముందు నిందితుడు రాజ్‌కుమార్ తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, నాలుగు పేజీల బాండ్ పేపర్‌పై తన చేతిరాతతో ఒక నోట్ కూడా రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
ఆ నోట్‌లో తన జీవితంలో జరిగిన పరిణామాలు, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, తనపై వచ్చిన కేసులు, ఎదురైన ఒత్తిళ్ల గురించి రాజ్‌కుమార్ వివరించినట్లు సమాచారం. తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నోట్‌లోని వివరాల ప్రకారం, తన స్వగ్రామానికి చెందిన అక్షయ అనే యువతి తనను ప్రేమిస్తున్నానని చెప్పి తనతో దగ్గరయ్యిందని రాజ్‌కుమార్ రాశాడు. అప్పటికే తనకు వివాహం జరిగి కుమారుడు ఉన్నప్పటికీ ఆమె ఒత్తిడితో ఆ సంబంధాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నాడు. మొదట్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, తర్వాత ఆ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిందని, అక్కడి నుంచి పరిస్థితులు మారిపోయాయని వివరించాడు.
ఒక సందర్భంలో యువతి తనను ఇంటికి రావాలని ఒత్తిడి చేయడంతో వెళ్లానని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు తమను చూసి తీవ్రంగా హెచ్చరించారని పేర్కొన్నాడు. ఆ తర్వాత తన పరువు తీస్తామని, భార్యకు విషయం చెబుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించాడు. భయంతో వారు అడిగినప్పుడల్లా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పలుమార్లు డబ్బులు ఇచ్చానని నోట్‌లో రాశాడు.
ఈ వేధింపులు భరించలేక యువతి తండ్రికి మొత్తం విషయం చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ తర్వాత కొంతకాలం పరిస్థితి మారినా, ఆయన మరణించిన తర్వాత మళ్లీ వివాదాలు మొదలయ్యాయని తెలిపాడు. యువతి బంధువుల నుంచి కూడా బెదిరింపులు ఎదురయ్యాయని, తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా గతంలో ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, ఆ విషయం తన భార్యకు తెలుసని నోట్‌లో పేర్కొన్నాడు. యువతి తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు తానే చికిత్స ఖర్చులు భరించానని, అయినప్పటికీ తన పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చివరిసారిగా యువతి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను తిరిగి తీసుకునేందుకు శంషాబాద్ వెళ్లానని, అక్కడ కూడా డబ్బుల కోసం ఒత్తిడి చేశారని నోట్‌లో రాశాడు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తనపై పోక్సో కేసు నమోదు చేయించారని ఆరోపించాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చాలా కాలం జైలులో ఉండాల్సి వస్తుందని బెదిరింపులు కొనసాగాయని పేర్కొన్నాడు.
also read :“నాపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు”.. సెల్ఫీ వీడియోలో రాజ్‌కుమార్ ఆరోపణలు