క్రైం మిర్రర్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యలకు పాల్పడే ముందు నిందితుడు రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే అతడి మొబైల్ ఫోన్ కూడా లభించిందని, అందులో ఈ వీడియో ఉన్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరణ్ జోషి వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, జూలై 10 సాయంత్రం సుమారు 4:55 గంటలకు రాజ్‌కుమార్ ఈ వీడియోను రికార్డ్ చేశాడు. అందులో తన మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎదురైన సంఘటనలు, ఈ స్థితికి ఎలా చేరుకున్నాడనే విషయాలను తన మాటల్లో వివరించినట్లు అధికారులు తెలిపారు.
వీడియోలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తన సంపాదనలో పెద్ద భాగాన్ని తాను నమ్మిన వారి కోసమే ఖర్చు చేశానని, భారీ మొత్తంలో డబ్బు కోల్పోయానని పేర్కొన్నాడు. ఒక యువతిని నమ్మి అప్పుల పాలయ్యానని, చివరికి తన పిల్లలకు ఆస్తి కూడా మిగలకుండా పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, తనను ఆర్థికంగా నష్టపరిచిన వారే చివరికి తనపై కేసు పెట్టించి జైలుకు పంపించారని కూడా ఆరోపించాడు.
ప్రస్తుతం ఈ వీడియోను ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లోని ఇతర సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నామని, దర్యాప్తు అన్ని కోణాల్లో కొనసాగుతోందని కమిషనర్ వెల్లడించారు.
అయితే, వీడియోలో రాజ్‌కుమార్ చేసిన ఆరోపణలు అతడి వ్యక్తిగత వాదన మాత్రమే. వాటి నిజానిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టమవుతాయని పోలీసులు పేర్కొన్నారు.
also read : సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీపై బీసీసీఐ కీలక ప్రకటన!