బజారుకి వెళ్లడానికైనా, చిన్న పనులకైనా మీ పిల్లలకు బైక్ లేదా కారు ఇస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు గట్టిగా కట్టడి చేయడానికి సిద్ధమయ్యారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 199 ప్రకారం, 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మైనర్ వాహనం నడిపితే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేయనున్నారు. అంతేకాదు, ఆ మైనర్‌కు 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా నిషేధం విధించే అవకాశముంది. ఇక మైనర్‌కు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. రూ.25,000 వరకు జరిమానాతో పాటు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఒకసారి కాదు, మళ్లీ అదే తప్పు చేస్తే తల్లిదండ్రులను నేరుగా బాధ్యులుగా చేసి మరింత కఠిన శిక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది మాత్రమే ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన 4,000కు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పిల్లల భద్రతతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదరహిత సమాజం కోసం అందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
also read: పిల్లలు చూసుకోకపోతే ఆస్తి తిరిగి తల్లిదండ్రులదే.. బాంబే హైకోర్టు కీలక తీర్పు