భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించబడింది. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ హక్కుల కోసం వారు సుమారు రూ.250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. మొదట ఈ డీల్ రూ.500 కోట్ల వద్ద చర్చలు ప్రారంభమైనప్పటికీ, చివరికి తక్కువ మొత్తానికి ఫైనల్ అయ్యింది.
డీల్‌కు ముందు ధర్మ ప్రొడక్షన్స్ టీమ్ దాదాపు 30 నిమిషాల ఫుటేజ్‌ను వీక్షించినట్లు టాక్. గతంలో ‘బాహుబలి’, ‘2.0’ వంటి భారీ చిత్రాలను విడుదల చేసిన అనుభవంతో, ఈ సినిమాపై కూడా వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ స్టార్ యష్, సన్నీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొదటి భాగాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూలై 18న విడుదల చేయనున్నట్లు సమాచారం. భారీ స్టార్ కాస్ట్, విశాలమైన బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణంతో ‘రామాయణం’ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
also read: ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!