HomeజాతీయంNikah Halala: మతం ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులా? నిఖా హలాలాపై హైకోర్టు షాకింగ్ కామెంట్స్!

Nikah Halala: మతం ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులా? నిఖా హలాలాపై హైకోర్టు షాకింగ్ కామెంట్స్!

నిఖా హలాలా, ట్రిపుల్ తలాఖ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన ఆచారాల పేరుతో జరిగే నేరాలకు చట్టపరమైన రక్షణ ఉండదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్త, ఓ మౌలానా, కుటుంబ సభ్యులు సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాల్య వివాహం, ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, పునర్వివాహం పేరుతో తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, అలాగే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రాథమికంగా వాటికి ఆధారాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. అందువల్ల ఈ దశలో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి ఎలాంటి కారణాలు లేవని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాఖ్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నిఖా హలాలా అనేది, విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందుగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆ వివాహం ముగిసిన తర్వాతే మొదటి భర్తను తిరిగి వివాహం చేసుకునే సంప్రదాయంగా చెప్పబడుతుంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఈ ఆచారాన్ని అడ్డుపెట్టుకుని భర్త, అతని సోదరుడు, ఇతర బంధువులు, ఓ మతపెద్ద తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా వంటి ఆచారాలు సమాజంలోని చీకటి అధ్యాయాలను గుర్తు చేస్తున్నాయని, మహిళలపై ఇలాంటి వేధింపులు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు