క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. కానీ, చివరి నిమిషంలో అవార్డుల ప్రకటన వాయిదా వేసింది. అందుకు గల కారణాలు తెలియరాలేదు. అయితే కొత్త ప్రకటన తేదీని కూడా కేంద్ర వెల్లడించలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ పొందిన చిత్రాలు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులకు అర్హత సాధించాయి.
ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సాంకేతిక విభాగాలు సహా పలు కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన సినిమాలు, కళాకారులను ఈ అవార్డులతో సత్కరిస్తారని సినీ అభిమానులు భావించారు. ఈ ఏడాది ఎంపిక ప్రక్రియను ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ నిర్వహించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం విజేతలను ఖరారు చేసినట్లు సమాచారం. కానీ వాటిని ప్రకటించలేదు. ఈ వాయిదాతో సినీ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.