Homeతెలంగాణప్రముఖ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు – నాణ్యతలేని మాంసం బట్టబయలు

ప్రముఖ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు – నాణ్యతలేని మాంసం బట్టబయలు

హైదరాబాద్‌ అత్తాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్‌ బార్బె క్యూ నేషన్‌ పై ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

ఇటీవల ఆ రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురవడంతో ఫుడ్ పాయిజనింగ్ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కిచెన్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. చికెన్, మటన్ వంటి మాంసాన్ని 4 నుండి 5 రోజుల పాటు నిల్వ ఉంచుతున్నట్లు, అలాగే పాత మాంసంపై లేబుళ్లు మార్చి కొత్తవిగా చూపిస్తూ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది.

దీంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసం కలుషితమై ఉండే అవకాశం ఉందని, అదే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదనంగా, వంటశాలలో పరిశుభ్రత లోపం కూడా గమనించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, జరిమానా విధించారు. అలాగే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

also read: 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌కు నిరాశ!!

తాజావార్తలు