విజయవాడ, క్రైమ్ మిర్రర్: దేశీయ వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఒక కీలక మైలురాయి నమోదయ్యింది. అత్యంత ప్రసిద్ధి చెందిన బంగినపల్లి మామిడి పండ్లను వాణిజ్యపరంగా తొలిసారి సముద్ర మార్గం ద్వారా సింగపూర్‌కు విజయవంతంగా పంపారు. దీంతో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా తాజా పండ్లను ప్రపంచ మార్కెట్లకు చేర్చేందుకు కొత్త మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియను వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి పర్యవేక్షించింది. ఇందులో భాగంగా జూన్ 11న ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ 5 మెట్రిక్ టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను ఎగుమతి చేయగా.. ఈ కన్సైన్‌మెంట్ జూన్ 24న సింగపూర్ చేరుకుంది. ఈ ఎగుమతి ప్రక్రియ విజయవంతం కావడం వెనుక లక్నోలోని ఐకార్‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ కీలక పాత్ర పోషించింది.ఎగుమతి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ‘గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్’ (జీఏపీ) ధ్రువీకరణ పొందిన తోటల నుంచి సేకరించిన మామిడి పండ్లను.. కర్ణాటకలోని అపెడా గుర్తింపు పొందిన ప్యాక్‌హౌస్‌లో శుద్ధి చేసి ప్యాకింగ్ చేశారు. ఈ ఎగుమతి ద్వారా రైతులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది.
Also Read:మహా వికాస్ అఘాడీలో ఉద్ధవ్ బాంబ్… కూటమిపై ఘాటు వ్యాఖ్యలు…!
స్థానిక మార్కెట్‌లో మామిడి కిలో రూ. 25- రూ. 26 పలుకుతోంది. కానీ, సింగ్‌పూర్‌కు ఎగుమతి చేయడం ద్వారా కిలోకు సుమారు రూ. 50 వరకు లభించింది. దీంతో రైతుల ఆదాయం దాదాపు రెట్టింపయ్యింది.అలాగే, ఈ మామిడి పండ్లను దిగుమతి చేసుకున్న సింగూర్ సంస్థ ఈసీ-లింక్స్ లిమిటెడ్.. నాణ్యత అద్భుతంగా ఉందని ప్రశంసించింది. పండ్ల తియ్యదనం, ఒకేరీతిలో పక్వానికి రావడం, ఎక్కువ కాలం నిల్వ ఉండటం వంటి లక్షణాలను ఆ సంస్థ ప్రత్యేకంగా అభినందించింది. సింగపూర్ నిర్దేశించిన నాణ్యత, ఫైటోశానిటరీ ప్రమాణాలను ఈ కన్సైన్‌మెంట్ విజయవంతంగా అందుకోవడం హర్షణీయం. శాస్త్రీయ విధానాల్లో మామిడి కోత, ఉత్తమ యాజమాన్య పద్దతులు, సముద్ర రవాణాలో కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ సమర్థతను ఇది నిరూపించింది.బంగినపల్లి మామిడి పండు తన బంగారు పసుపు వర్ణం, పీచులేని గుజ్జు, చక్కటి సువాసన, అద్భుతమైన తీపిదనంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
Also Read:పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్ లాంటి విజయం.. రామ్ చరణ్ కష్టానికి హ్యాట్సాఫ్ : అనిల్ రావిపూడి
ఇక, జలమార్గం ద్వారా ఎగుమతి ఖర్చు వాయు మార్గంతో పోలిస్తే తక్కువకావడమే కాదు, పర్యావరణ హితమైందని, వాణిజ్యపరంగా లాభదాయకమైందని రుజువు చేసింది. అలాగే, శక్తిమంతమైన కోల్డ్-చైన్ మౌలిక సౌకర్యాలు, శాస్త్రీయ నిర్వహణ విధానాల సహకారంతో సముద్ర మార్గాల ద్వారా రవాణా భారత ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వ్యవసాయ ఎగుమతులను పెంచడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా తగినంత గుర్తింపు తీసుకురావడం అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అపెడా ఈ చొరవ తీసుకుంది. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను జల మార్గంలో ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read:ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మరోసారి హైకోర్టు నోటీసులు!!