క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : మహారాష్ట్రలోని పూణేలో లోయలో పడి మృతి చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మృతి కేసును తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు.. పూర్తిస్థాయి విచారణ అనంతరం కాబోయే భార్య ఆయనను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజా పరిణామంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పూణే సమీపంలోని గహంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ (26) తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కేతన్ కు, సీయా గోయల్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 25న పెళ్లి జరగనుంది.
పెళ్లిని ఘనంగా జరుపుకునేందుకు రాజస్థాన్లోని ఒక లగ్జరీ ప్యాలెస్ ను రూ.17 కోట్ల రూపాయలకు బుక్ చేశారు. అతిథుల కోసం రెండు చార్టెడ్ విమానాలను కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే కాబోయే వధూవరులు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో జూన్ 18న ఆమె కేతన్ ను లోహగడ్ కోటకు ట్రక్కింగ్ కు తీసుకువెళ్లింది. అయితే, అక్కడ కేతన్ తనను ఫోటోలు తీస్తుండగా బలమైన గాలులకు అదుపుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలియజేసింది. పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలియడంతో లోతుగా దర్యాప్తును ప్రారంభించి అసలు విషయాన్ని నిర్ధారించారు.
తడబడుతూ సమాధానాలు చెప్పిన సియా.. పెరిగిన అనుమానం..
కేతన్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు అంటూ సియా చెప్పిన మాటలను వారి కుటుంబ సభ్యులు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే కేతన్ మంచి ట్రెక్కర్ కావడంతో అంత సులభంగా కాలుజారి పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు భావించారు. అయితే కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి ఇంటికి వెళ్ళినప్పుడు.. అతని సోదరి పలు ప్రశ్నలను అడిగింది. వాటికి సమాధానం చెప్పేందుకు సియా తడబడుతూ ఉండడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులకు.. కేతన్ కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని వెల్లడించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు టెక్నికల్ ఆధారాలను పరిశీలించి అనేక విషయాలను నిర్ధారించుకున్నారు. పోలీసులు దర్యాప్తులో సియాకు పూణేలోని కొండ్యాకు చెందిన చేతన్ బాబులాల్ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. గడచిన ఆరు నెలల్లో వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్ 18న చేతన్ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్ చేసి తన ఫోన్ ను సొంత షాపులో వదిలేశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన షాప్ ఉద్యోగి ఫోన్ తీసుకొని రహస్యంగా లోహా గడ్ కోటకు చేరుకున్నాడు. పోలీసులు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో చేతన్ కలిసి కేతన్ ను వదిలించుకోవాలని స్కెచ్ వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 14న అతన్ని కొండపై నుంచి గెంటేయాలని చూసారూ. కానీ అది కుదరలేదు. దీంతో మళ్లీ జూన్ 18న బర్త్ డే వేడుకలు కారణంతో కొండపైకి తీసుకెళ్లి వెనుక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు కేతన్ తో ఉన్న పాత వీడియోలు షేర్ చేస్తూ ‘నా పుట్టినరోజు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయావు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని తిరిగి వచ్చేయ్’ అంటూ పోస్టులు పెట్టింది. నిందితులిద్దరుపైన హత్య, నేర పూరిత కుట్ర కేసులు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం యువ వ్యాపారవేత్తను హత్య చేసిన సియా ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.