క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గడిచిన 20 రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆయనప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ పై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్లో నిలిపివేయాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ, ఎస్డిఆర్ఎఫ్, పోలీసు బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలను చేపడుతున్నాయి. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలతోపాటు కాలువలు, చెరువులు, గ్రామ పరిసరాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బృందాలు గాలింపు చర్యలను నిలిపివేయడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ పై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గాలింపు చర్యలను నిలిపివేసినప్పటికీ కిడ్నాప్ కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాలను బేస్ చేసుకుని కేసులో కొత్త కోణాలు వెలుగులకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక ఆలస్యం..
పది రోజుల కిందట పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ కేసులో అత్యంత కీలకంగా పెంపుడు కుక్కను భావిస్తూ వచ్చారు. ఈ కుక్క అనూహ్యంగా మృతి చెందడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కుక్క మృతి చెందిన తర్వాత అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు పోస్ట్ మార్టం చేయించారు. అయితే దాదాపు పది రోజులు గడుస్తున్నప్పటికీ కుక్క పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు పోలీసులకు అందలేదు. దీంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే ఈ కేసు పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇకపోతే చిన్నారి మిస్సింగ్ కేసులో హైకోర్టు కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ సాగుతున్న చిన్నారి ఆచూకీ మాత్రం లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. 20 రోజులు దాటుతున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇన్ని రోజులుగా కనిపించని చిన్నారి కనిపించే లేదు అన్న బావనను కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కిడ్నాప్ అయి ఉంటే ప్రాణాలతో ఉంటుందని, లేకపోతే చిన్నారి ప్రాణాలతో దొరికే అవకాశం ఉండదు అన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్నారి ప్రాణాలతో రావాలని అంతా కోరుకుంటున్నారు.