సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అంటే కుటుంబ నేపథ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా రావడం అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అంశంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ వివాదం మరింత పెద్దదైంది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్, అవుట్‌సైడర్స్ మధ్య పోలికలు ఎక్కువయ్యాయి.
ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో నెపోటిజం చర్చకు కారణం నటి ఆలియా భట్, శార్వరీ వాఘ్. వీరిద్దరూ కలిసి ‘ఆల్ఫా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ ఒక టెలివిజన్ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వీరి ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు శార్వరీ చాలా టాలెంట్ ఉన్న నటి అని ప్రశంసిస్తున్నారు. విమర్శలు వచ్చినా ఆమె ఎంతో ప్రశాంతంగా స్పందించిందని, తన సమాధానాలతో ఆకట్టుకుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఆలియా భట్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె కావడం వల్లే ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆలియా అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె తన నటనతోనే స్టార్ స్థాయికి చేరుకుందని చెబుతున్నారు.అలాగే శార్వరీని పూర్తిగా అవుట్‌సైడర్‌గా చూడడం కూడా సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆమెకు కూడా మంచి నేపథ్యం ఉందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఆలియా, శార్వరీ అభిమానుల మధ్య పెద్ద చర్చ కొనసాగుతోంది. అయితే, చివరికి ప్రేక్షకులు మాత్రం ఒకే విషయం చెబుతున్నారు. సినిమా రంగంలో కుటుంబ నేపథ్యం ఎంత ఉన్నా, సపోర్ట్ ఎంత వచ్చినా, చివరకు నిలబెట్టేది మాత్రం టాలెంట్ మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు.