కన్నడ నటి రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొంత కాలంగా ఏఐతో అసభ్య వీడియోలు
కొంతకాలంగా తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు వ్యక్తులు ఏఐ టెక్నాలజీతో మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని రుక్మిణి వసంత్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తాను బికినీ ధరించినట్లు కనిపించేలా నకిలీ చిత్రాలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని కూడా ఆమె తెలిపారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాగల్ కోట్ జిల్లాకు చెందిన రవికుమార్ (24), బెంగళూరుకు చెందిన చంద్రకాంత్ (33), మహాలక్ష్మీ నగర్‌కు చెందిన రంజిత్ (25) ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, రుక్మిణి వసంత్ కన్నడ సినిమా ‘బీర్బల్ ట్రయాలజీ’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం తెలుగు, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.