- రాజ్యసభ పదవి దక్కకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి రెడ్డప్ప గారి కుటుంబం గుడ్ బై చెప్పనుందా? రాయలసీమ పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. కడప జిల్లాలో కీలక నేతగా ఉన్నారు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి. మొన్నటి రాజ్యసభ స్థానాల భర్తీలో తనకు అవకాశం దక్కుతుందని ఆశించారు శ్రీనివాస్ రెడ్డి. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. అయినా సరే పార్టీలోనే ఉండి క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాధవి రెడ్డికి వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
బాహటంగానే అసంతృప్తి..
రాజ్యసభ ఎంపికలో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఛాన్స్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అయితే దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ రెడ్డి. అటు తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. చివరకు డీఆర్సీ సమావేశానికి సైతం హాజరయ్యారు. దీంతో పార్టీపై ఆ దంపతులు అసంతృప్తితో ఉన్నారని.. టిడిపికి గుడ్ బై చెప్పడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక మంత్రులు ఆ దంపతులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారు మెత్తబడినట్లు సమాచారం.
దూకుడు కలిగిన ఫ్యామిలీ..
కడప జిల్లాకు సుదీర్ఘకాలం టిడిపి అధ్యక్షుడిగా పని చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ పగ్గాలు తీసుకోవడానికి కూడా ఏ నేత ముందుకు రాని పరిస్థితుల్లో.. నేనున్నాను అంటూ అప్పట్లో ముందుకు వచ్చారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన భార్య మాధవి రెడ్డి కడప నగరంలో దూకుడుగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా ఉన్న అంజాద్ బాషాను ధీటుగానే ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో టిడిపి కూటమికి ఏడు అసెంబ్లీ సీట్లు రావడం వెనుక రెడ్డప్ప గారి కుటుంబం పాత్ర ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడుని ఏర్పాటు చేశారు. మహానాడు వేదికపై తాము ఎదుర్కొన్న ఇబ్బందులు తలుచుకొని రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి బోరున విలపించారు. ఆ సమయంలోనే చంద్రబాబు ఆయనను ఓదార్చారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తప్పకుండా మంచి భవిష్యత్ కల్పిస్తానని హామీ ఇచ్చారు.
పార్టీ పదవుల్లో సైతం..
రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరోలో ఉండేవారు. కానీ ఇటీవల నియామకాల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభ ఇచ్చేందుకు పార్టీ కార్యవర్గంలో ఛాన్స్ ఇవ్వలేదని అనుకున్నారు. రాజ్యసభ పదవుల భర్తీకి సంబంధించి మూడు స్థానాలు టీడీపీకి దక్కాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేరును ఖరారు చేశారు. కానీ ఒక పదవిని రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆశించారు. ఆయనకు దక్కకపోయేసరికి సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు తరుపున కొంతమంది నేతలు రంగంలోకి దిగి సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పట్లో వివాదం ముగిసింది అనుకున్నారు. కానీ రెడ్డప్ప గారి దంపతులు పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతుండడంతో వారు పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం కడప పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. వారికి వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే భవిష్యత్తు అవకాశం కోసం తమ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నామే తప్ప.. పార్టీని విడిచి పెట్టే ఛాన్స్ లేదని రెడ్డప్ప గారి దంపతులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..