ఒకప్పుడు తినడానికి ఆహారం దొరకక వీధుల్లో అల్లాడిన ఓ సాధారణ వీధికుక్క, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా “పీస్ డాగ్”గా గుర్తింపు పొందితే ఆశ్చర్యంగా అనిపించక మానదు. అలా సాధారణ జీవితం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ఈ కుక్క పేరు ‘అలోకా’. ఇప్పుడు ఇది కేవలం ఒక జంతువు కాదు, శాంతి, ప్రేమకు ప్రతీకగా మారింది.
2022 ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరుగుతున్న సమయంలో అలోకా జీవితంలో మలుపు తిరిగింది. భారత్లో శాంతి యాత్ర చేస్తున్న బౌద్ధ భిక్షువుల బృందం దీనికి ఆహారం ఇచ్చి ఆదరించింది. ఆ ప్రేమను అనుభవించిన అలోకా, వారిని విడిచి వెళ్లకుండా వారితో పాటు నడక ప్రారంభించింది. అలా మొదలైన ఈ ప్రయాణం కేవలం కొన్ని రోజులు కాదు… 100 రోజుల పాటు సాగిన శాంతి యాత్రగా మారింది.
భారత్తో పాటు నేపాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దాదాపు 2300 మైళ్లు నడిచిన ఈ యాత్రలో అలోకా కూడా భాగస్వామ్యమైంది. ఈ ప్రయాణం ముగిసిన తర్వాత ఆ బౌద్ధ భిక్షువు దానికి ‘అలోకా’ అనే పేరు పెట్టి, అమెరికాలోని తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడినుంచి అలోకా జీవితం పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడీ కుక్క సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. “Peace Dog Aloka” పేరుతో ఉన్న ఖాతాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు దీనిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు దాన్ని తాకి ఆశీర్వాదంగా భావిస్తే, మరికొందరు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అలోకా పాల్గొనగా, దాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. దానిని దగ్గరగా చూసేందుకు, తాకేందుకు క్యూల్లో నిలబడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలోకా కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ప్రేమ, దయ ఉంటే సాధారణ జీవితం కూడా అసాధారణంగా మారుతుంది. ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా పూర్తిగా మార్చగలదని ఇది నిరూపిస్తుంది.