ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ చివరకు ఓ దంపతులను జైలు పాలయ్యే పరిస్థితికి తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు ఏకంగా ఇంట్లోనే నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేశారు. అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రూ.500 నకిలీ నోట్లను వినియోగిస్తూ మోసాలకు పాల్పడిన ఈ దంపతుల వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికి చేరడంతో వారి అక్రమ కార్యకలాపాలకు తెరపడింది. నల్లగొండ జిల్లా పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించిన పరికరాలతో పాటు పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విజయవాడ రాజీవ్, పావని దంపతులు గతంలో మిర్యాలగూడ, నల్లగొండ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న కంచర్ల టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వీడియోలను వీక్షిస్తూ నకిలీ కరెన్సీ తయారీపై సమాచారం సేకరించినట్లు విచారణలో తేలింది.
అనంతరం నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన ప్రింటర్, ప్రత్యేక పేపర్లు మరియు ఇతర సామగ్రిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ఇంట్లోనే రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి వాటిని మార్కెట్‌లో చలామణి చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే దుకాణాలు, సంతలు, వృద్ధులు నిర్వహిస్తున్న వ్యాపార కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. చిన్న మొత్తాల వస్తువులు కొనుగోలు చేసి నకిలీ నోట్లను ఇచ్చి అసలు డబ్బును తిరిగి తీసుకునే పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వ్యవహారం చండూరు మండలం తాస్కానీగూడెం గ్రామంలోని ఓ పాల విక్రయ కేంద్రంలో బయటపడింది. రాజీవ్ పాల ప్యాకెట్ కొనుగోలు చేసి దుకాణ యజమాని ఆవుల కిరణ్‌కు రూ.500 నోటు ఇచ్చాడు. ఆ నోటును పరిశీలించిన కిరణ్‌కు అనుమానం రావడంతో వెంటనే చండూరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేసి నకిలీ కరెన్సీ చలామణి ముఠాపై ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా నల్లగొండలోని కంచర్ల టవర్స్‌లో నివసిస్తున్న రాజీవ్, పావని దంపతుల ఇంటిపై దాడి నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేసినట్లు దంపతులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. వారి ఇంటి నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్, స్కానర్, పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. రాజీవ్‌పై ఇప్పటికే మిర్యాలగూడలో రౌడీ షీట్ నమోదై ఉందని, అదనంగా తెలుగు రాష్ట్రాల్లోని మహబూబాబాద్, తొర్రూర్, కరీంనగర్, గోదావరిఖని, జనగాం, అద్దంకి, వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నకిలీ కరెన్సీ చలామణికి సంబంధించిన మొత్తం 7 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ మార్గాలను ఎంచుకుంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..?