Crime Mirror, Cinema Updates: తెలుగు ప్రేక్షకులకు రాక్షసుడు, నారప్ప వంటి చిత్రాలతో దగ్గరైన నటి అమ్ము అభిరామి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చెన్నై భామ, తాజాగా ఫీల్ మై లవ్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ తాజాగా విడుదలై సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read: రణ్‌బీర్ కల ఎప్పుడు నెరవేరుతుంది…?
హరి ప్రకాశ్ ఎం కథ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ మై లవ్ చిత్రంలో ఆదిత్య భాస్కర్, ఐరా, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్థీబన్ విడుదల చేశారు. అందమైన ప్రేమ ప్రయాణం మొదలు అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ మూవీని సూచిస్తోంది.
జీవితంలో ఎప్పుడు, ఏ క్షణంలోనైనా అద్భుతాలు జరగొచ్చనే సందేశంతో ఈ కథ సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండబోతోందని మేకర్స్ వెల్లడించారు.
Also Read: రూ.500 కోసం 8 గంటలు నిలబడిన సమంత..!
ఈ చిత్రానికి రాజా రవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జీ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. రాజాసాబ్ సినిమాతో పాటు ఫీల్ మై లవ్ ద్వారా కూడా అమ్ము అభిరామి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.