సాధారణంగా పిడుగులు భూమిపై పడటం, చెట్లు కాలిపోవడం లేదా మనుషులు, జంతువులు ప్రమాదానికి గురవడం వంటి ఘటనల గురించి వినే ఉంటాం. కానీ ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాన్ని పిడుగు తాకితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగితేనే భయానకంగా అనిపిస్తుంది. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే పిడుగుపాటుకు గురవడంతో వెంటనే అత్యవసరంగా తిరిగి కొలంబోకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనకు దారి తీసింది.
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది. మొత్తం 207 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనూహ్యంగా మారి, బలమైన మేఘాలు, ఉరుములు, మెరుపులతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో విమానాన్ని పిడుగు తాకినట్లు ప్రయాణికులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో పాటు విమానం కంపించినట్లు అనిపించిందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంజిన్ భాగంలో కొద్దిసేపు వెలుగులు లేదా నిప్పురవ్వలు కనిపించినట్లు సమాచారం.
SriLankan Airlines UL606 Returns to Colombo After Reported Lightning Strike
Courtesy: @asantha_azhb#SriLankanAirlines #UL606 #AviationNews #ColomboAirport pic.twitter.com/0vlQnSZ2xd
— DailyMirror (@Dailymirror_SL) June 13, 2026
ఈ ఘటనతో విమానంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొన్నప్పటికీ, సిబ్బంది వెంటనే పరిస్థితిని నియంత్రించారు. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి కొలంబో వైపు మళ్లించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియోలో విమానం సమీపంలో మెరుపులు, నిప్పురవ్వలు కనిపించినట్లు తెలుస్తోంది.
తర్వాత పైలట్లు ప్రయాణికులకు పరిస్థితిని వివరించారు. పిడుగుపాటు కారణంగా ఒక ఇంజిన్‌కు స్వల్ప నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ ప్రయాణాన్ని రద్దు చేసి విమానాన్ని తిరిగి కొలంబోకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రత కోసమే తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
“ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపరేషనల్ సమస్య తలెత్తింది” అని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమాన ప్రయాణాల్లో వాతావరణ పరిస్థితుల ప్రాముఖ్యత మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం విమానానికి జరిగిన సాంకేతిక నష్టంపై అధికారులు పరిశీలనలు కొనసాగిస్తున్నారు.