తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే వేగంగా ఎదుగుతున్న టీవీకే పార్టీకి తాజాగా భారీ బలం చేకూరింది. బీజేపీ, ఏఐఏడీఎంకేలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, వారి అనుచరులతో కలిసి టీవీకేలో చేరడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు అధికారికంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఎన్ ఆనంద్ సమక్షంలో పలువురు ప్రముఖులు టీవీకే కండువా కప్పుకున్నారు. ఈ పరిణామంతో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో టీవీకే ప్రభావం మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ చేరికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాజీ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి. ఆమె గతంలో వరుసగా మూడు సార్లు విలావంకోడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ స్థాయిని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆమెకు అక్కడ ఆశించిన స్థాయి బాధ్యతలు రాకపోవడం నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం కూడా ఆమె నిర్ణయంపై ప్రభావం చూపింది.
దీంతో బీజేపీకి గుడ్‌బై చెప్పిన విజయధరణి, వందలాది అనుచరులతో కలిసి టీవీకేలో చేరడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఆమె చేరికతో విలావంకోడ్ సహా దక్షిణ జిల్లాల్లో టీవీకే బలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఏఐఏడీఎంకేకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కేటీ పచ్చమ్మాళ్ కూడా టీవీకేలో చేరారు. జయలలిత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె పార్టీ మారడం కూడా గమనార్హం. వీరితో పాటు మరికొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కూడా టీవీకేకు మద్దతు ప్రకటించారు.
ఈ పరిణామాలన్నీ కలిసి చూస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఒకవైపు టీవీకే బలపడుతుండగా, మరోవైపు బీజేపీ, ఏఐఏడీఎంకేలు తమ శక్తిని పునర్‌వ్యవస్థీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి… ఆఖరి క్షణంలో కాపాడిన భారతీయుడు