-
ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..!
-
ఖరీఫ్ సన్నాహకాలపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష
మిర్యాలగూడ క్రైమ్ మిర్రర్, జూన్ 11: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) హెచ్చరించారు. రానున్న ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక, యూరియా నిల్వలు, ఎరువుల సరఫరాపై గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సీఈఓలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం, పంటల ఎంపిక, విత్తనాలు, ఎరువుల అవసరాలపై అధికారులు వివరాలు సమర్పించారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన.. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్!!
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, విత్తనాలు, వ్యవసాయ పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.యూరియా పంపిణీకి ఉపయోగిస్తున్న యాప్‌ను ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలకు అందుబాటులో ఉంచే అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
అలాగే మండలాల వారీగా యాప్ నిర్వహణ విధానాన్ని అమలు చేస్తే రైతులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు.సమావేశంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. జగదీశ్వర్ రెడ్డి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, పీఏసీఎస్ సీఈఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: అమెరికా దాడులు…గల్లంతైన ముగ్గురు భారతీయులు మృతి…!