Homeఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచ్‌లు బయటికి వస్తాయి.. వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచ్‌లు బయటికి వస్తాయి.. వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తుంటే.. తట్టుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో చాలాసార్లు పేపర్లు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను జగన్ వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అసమర్థతతపై తాము ప్రశ్నిస్తుంటే.. ప్రతీ ఒక్కరిపై కేసులు పెడుతున్నారని.. అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తే.. కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో వైసీపీనే కాక్రోచ్‌లు అంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కూటమి సర్కార్ చేసిన తప్పులను తాము ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబుకు నరాలు తెగిపోయే అంత బీపీ వస్తోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, వారిని అరెస్టులు చేసి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలని.. ఇది జెన్‌జీ కాలమని.. ఇప్పుడు జెన్‌ ఆల్ఫా కూడా నడుస్తోందని పేర్కొన్న వైఎస్ జగన్.. దేన్నీ ఆపలేరని గుర్తు చేశారు. మీరు ఆపాలని ప్రయత్నిస్తే.. ఇంతింతై వటుడింతై పెరుగుతుందని హెచ్చరించారు. దగాపడిన యువత కూటమి ప్రభుత్వాన్ని విడిచిపెట్టదని, తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచ్‌లు బయటికి వస్తాయి జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇక చంద్రబాబు పాలన మొత్తం లీకుల మయమేనని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రస్తుతం డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. 1995లో టెన్త్‌ క్లాస్‌ పేపర్ల లీక్‌.. 1996లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పేపర్స్‌ లీక్‌.. 1997లో ఇంటర్మీడియట్‌ పేపర్స్ లీక్‌.. 2017 టెన్త్‌ సైన్స్‌ పేపర్‌ లీక్‌.. 2019లో టెన్త్‌ పేపర్‌ లీక్‌.. 2025లో బీఈడీ పేపర్‌ లీక్‌.. 2025లో టెన్త్‌ మ్యాథ్య్స్‌ పేపర్‌ లీక్‌.. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ పేపర్ లీక్‌ అంటూ ఎద్దేవా చేశారు.

పేపర్ లీకుల్లో ఇది చంద్రబాబు రికార్డు అంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డీఎస్సీపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. అందుకే దీనిపై తాము సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబడుతున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఈ కేసులో లోతుగా విచారణ చేస్తే.. మరిన్ని విషయాలు తప్పకుండా బయటికి వస్తాయని తేల్చి చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా స్వయానా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఉన్నారు కాబట్టి.. ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రారని ఆరోపించారు. పైగా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులు అంతా వారం రోజుల క్రితం తన వద్దకు వచ్చారని గుర్తు చేసిన వైఎస్ జగన్.. వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఒకవేళ అప్పటికీ న్యాయం జరగకపోతే.. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కమిషన్‌ ఏర్పాటు చేసి.. రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు