ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో కనిపించే ఎలాన్ మస్క్ ఇప్పుడు మరో అరుదైన రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఏ వ్యక్తి చేరుకోని స్థాయిలో సంపదను కూడబెట్టే అవకాశం ఆయనకు కనిపిస్తోంది. ప్రపంచ సంపన్నుల ఆస్తులను అంచనా వేసే ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం మస్క్ నికర ఆస్తుల విలువ ఇప్పటికే భారత కరెన్సీలో సుమారు రూ.75 లక్షల కోట్లకు పైగానే ఉంది.
షేర్ మార్కెట్ లోకి స్పేస్‌ఎక్స్
మస్క్ కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీగానే కొనసాగుతోంది. అయితే, ఈ సంస్థ షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పేస్ ఎక్స్ లో మస్క్ కు 50 శాతానికి పైగా వాటా ఉండటంతో, ఆ కంపెనీ విలువ మరింత పెరిగితే ఆయన వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
తొలి ట్రిలియనీర్ గా గుర్తింపు!
ఆర్థిక విశ్లేషకుల అంచనాల ప్రకారం.. మస్క్ మొత్తం ఆస్తుల విలువ 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్ గా గుర్తింపు పొందే వ్యక్తిగా ఆయన నిలుస్తారు. అంటే 1 ట్రిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన తొలి వ్యక్తి అవుతారు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది కోటి కోట్ల రూపాయలకు సమానమైన మొత్తం.
పలు దేశాల జీడీపీ కంటే ఎక్కువ!
మస్క్ సంపద పరిమాణం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మరో విషయం గమనించాలి. ఆయన ఆస్తుల విలువ ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ. అంతేకాకుండా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి ప్రముఖ బిలియనీర్ల ఆస్తులను కలిపినప్పుడే ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతుంది. అలాంటి స్థాయికి మస్క్ ఒక్కడే చేరువ కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.