హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది చేదువార్తే. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరల సవరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల దృష్ట్యా మద్యం ధరలను కనీసం 10 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తుండగా.. ధరలు పెంచితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి సరిహద్దుల ద్వారా అక్రమ మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సునీల్ కిషోర్ జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరుపుతోంది.తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం ధరల సవరణపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం నుండి మూడు రోజుల సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.
ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. మద్యం కొనుగోలు ధరల పెంపు నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు పెద్ద సవాల్‌గా మారింది. ఒకవైపు మద్యం కంపెనీల నుంచి వస్తున్న ధరల పెంపు ఒత్తిడి, మరోవైపు ధరలు పెంచితే పొరుగు రాష్ట్రం నుండి ముంచుకొచ్చే అక్రమ మద్యం స్మగ్లింగ్ ముప్పు.. ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. విచారణలో మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులు కమిటీ ముందు హాజరై తమ నివేదికలను సమర్పించారు. మద్యం తయారీకి అవసరమయ్యే ముడిసరుకులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తమకు లాభసాటిగా ఉండాలంటే కనీసం 10 శాతం మేర కొనుగోలు ధరలను పెంచాలని వారు అభ్యర్థించారు. అయితే మద్యం కంపెనీల డిమాండ్ సమంజసంగానే ఉన్నప్పటికీ ధరలను భారీగా పెంచితే అది రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి గండికొట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ సుదీర్ఘమైన అంతరాష్ట్ర సరిహద్దును పంచుకుంటోంది. తెలంగాణలో మద్యం ధరలు గనుక విపరీతంగా పెరిగితే.. రెండు రాష్ట్రాల మధ్య రేట్ల వ్యత్యాసం భారీగా పెరుగుతుందని అంటున్నారు.తెలంగాణలో కొనుగోలు ధరలు పెరిగితే.. అది అంతిమంగా రీటైల్ ధరలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గనుక రీటైల్ ధరలు తక్కువగా ఉంటే సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల వంటి ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల తెలంగాణకు రావాల్సిన పన్నుల రూపంలోని భారీ ఎక్సైజ్ రాబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతూనే ఇటు సరిహద్దు ముప్పును అరికట్టేలా జస్టిస్ సునీల్ కిషోర్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.