శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో జరిగిన చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలు, నగదు మాయమవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో భద్రతా లోపాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
టెక్కలి మండలం తెంబూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ అనారోగ్య సమస్యలతో బుధవారం పలాస ప్రభుత్వ కిడ్నీ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు శుక్రవారం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లే ముందు మెడలో ఉన్న పసుపుతాడుకు చెందిన పావు తులం బంగారపు పుస్తెలను ఆమె కుమార్తె రాజేశ్వరి తీసి తన పర్సులో భద్రపరిచింది. అలాగే పర్సులో రూ.3000 నగదు కూడా ఉంచింది.
శనివారం ఉదయం తన తల్లిని వార్డులోని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లిన రాజేశ్వరి కొద్దిసేపటి తర్వాత తిరిగి గదికి చేరుకుంది. అయితే ఆ సమయంలో గదిలో ఎవరో వచ్చి శుభ్రపరిచినట్లు, బెడ్‌పై ఉన్న పాత బెడ్‌షీట్‌ను మార్చినట్లు ఆమె గుర్తించింది. దీనిని పెద్దగా పట్టించుకోని రాజేశ్వరి కొంతసేపటి తర్వాత టిఫిన్ కొనుగోలు చేయడానికి డబ్బులు తీసేందుకు తన పర్సును తెరిచి చూడగా అందులో ఉన్న పావు తులం బంగారపు పుస్తెలతో పాటు రూ.3000 నగదు కనిపించకపోవడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
వెంటనే వార్డులోని ఇతరుల వద్ద ఆరా తీసిన బాధితులు చుట్టుపక్కల బ్యాగులు, వస్తువులు పరిశీలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో రాజేశ్వరి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదే సమయంలో పక్క వార్డులో చికిత్స పొందుతున్న మరో రోగికి చెందిన ప్యాంట్ జేబులో ఉన్న రూ.300 కూడా చోరీకి గురైనట్లు సమాచారం వెలుగులోకి రావడంతో ఆసుపత్రిలో వరుస దొంగతనాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం బాధాకరమని, ఆసుపత్రి నిర్వహణలో పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రోగులు, వారి బంధువులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇలాంటి దొంగతనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు.
ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ప్రతి వార్డులో నిఘా ఏర్పాట్లు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. అలాగే చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోయిన బంగారం, నగదు తిరిగి అందేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందంటే..?